పిల్లనిచ్చిన మామను ఓ అల్లుడు అతి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో  మాటా మాటా పెరిగి.. ఆవేశంలో రోలుతో తలపై మోది హత్య చేశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన చింతల గోపి కొద్ది రోజులుగా నల్గొండలో పాత సామాను వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల తరచూ భార్య వెంకటలక్ష్మితో గొడవ పడుతున్నాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ తీర్చేందుకు వెంకట లక్ష్మి తండ్రి ఒంటిపల్లి వెంకటేశ్వర్లు(45) నాలుగు రోజుల క్రితం బాపట్ల నుంచి రాంనగర్ వచ్చాడు.

ఆదివారం మామ, అల్లుడు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆవేశంలో గోపి పక్కనే ఉన్న రోలు తీసుకొని మామ వెంకటేశ్వర్లు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.