ఆనాటి శ్రవణ కుమారుడు అందులైన తల్లిదండ్రులకు కావడిపై మోస్తే ఈ అభినవ శ్రవణ కుమారుడు తల్లిని తోపుడుబండిపై కూర్చోబెట్టి కొండగట్టుకు బయలుదేరాడు.
జగిత్యాల : కన్నతల్లి ఆరోగ్యం కోసం ఓ నిరుపేద కొడుకు తాపత్రయం అందరినీ ఆకట్టుకుంటోంది. కన్నతల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ కొడుకు చూడలేకపోయాడు... అలాగని లక్షలు పోసి వైద్యం చేయించే పరిస్ధితిలోనూ అతడు లేడు. కాబట్టి తల్లిని దైవసన్నిధికి తీసుకెళ్ళి దేవుడి దయతో ఆరోగ్యవంతురాలిని చేసుకోవాలని భావించాడు. దీంతో స్వయంగా తానే చెక్కలతో ఓ వాహనాన్ని తయారుచేయించి నడవలేని స్థితిలో వున్న తల్లిని కూర్చోబెట్టి తోసుకుంటూ కొండగట్టుకు బయలుదేరాడు. ఇలా తల్లిపై ప్రేమతో ఆ కొడుకు అభినవ శ్రవణ కుమారుడిగా మారాడు.
వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన మల్లయ్య తల్లి వృద్దాప్యంలో అనారోగ్యంతో బాదపడుతోంది. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొద్దిరోజులు వుంటే తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని మల్లయ్య నమ్ముతున్నాడు. అయితే పేదరికంతో బాధపడుతున్న మల్లయ్య ఏ వాహనంలోనో తల్లిని కొండగట్టుకు తీసుకువెళ్లే స్తోమత లేదు. అలాగని తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటూ అలాగే చూస్తూ వుండలేకపోయాడు. ఏం చేయాలా అని మదనపడుతున్న సమయంలో మల్లయ్యకు ఓ ఆలోచన వచ్చింది.
కట్టెలతో చేసిన తోపుడుబండి లాంటి వాహనంలో తల్లిని కూర్చోబెట్టి తోసుకుంటూ కొండగట్టుకు ప్రయాణం ప్రారంభించాడు మల్లయ్య. ఇలా వంద కిలోమీటర్లకు పైగా దూరమున్న కొండగట్టుకు కాలినడకన బయలుదేరి ఇప్పటికే 70 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇలా తల్లిని చెక్కబండిపై కూర్చోబెట్టుకుని వెళుతున్న మల్లయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతడు తల్లిపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
Read More కాసుల కోసం కన్నతల్లిపై హత్యాయత్నం... కామారెడ్డిలో కసాయి కొడుకు దారుణం
తన కొండగట్టు ప్రయాణంపై మల్లయ్య మాట్లాడుతూ... తల్లి ఆరోగ్యం బాగుపడాలనే ఇదంతా చేస్తున్నానని అన్నారు. డబ్బులు లేకపోయినా తల్లిపై ప్రేమ వుందని... అదే తనను నడిపిస్తోందన్నారు. తల్లిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని చేసుకునేందుకు ఎక్కడికయినా వెళతానని అన్నాడు. కన్న తల్లికోసం మల్లయ్య పడుతున్న తాపత్రయం అందరినీ కదిలిస్తోంది.
