ఆస్తి కోసం కన్నతల్లినే చంపడానికి ప్రయత్నించాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో వెలుగుచూసింది.
కామారెడ్డి : నవమాసాలు కడుపున మోసి కనిపెంచిన కొడుకే ఆ తల్లిపాలిట యముడయ్యాడు. డబ్బులు కోసం ఆ కసాయి కొడుకు కన్నతల్లినే చంపడానికి ప్రయత్నించాడు. ఇంటికి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించగా ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ కు చెందిన నారాయణ-చంద్రవ్వ దంపతుల కొడుకు అశోక్. భర్త నారాయణ మృతిచెందడం, భార్యాపిల్లలతో కలిసి కొడుకు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో వుండటంతో చంద్రవ్వ ఒంటరిగానే బీర్కూర్ లో నివాసముంటోంది. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం, ఇంటిపక్కన గదులను అద్దెకివ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో ఆమె జీవినం సాగిస్తోంది.
అయితే ఆమె కొడుకు అశోక్ డబ్బుల కోసం నిత్యం గొడవపడుతుండేవాడు. వ్యవసాయం, అద్దె డబ్బులు తనకే ఇవ్వాలంటూ హైదరాబాద్ నుండి వచ్చిన ప్రతిసారి తల్లిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఆ డబ్బులే జీవనాధారం కావడంతో చంద్రవ్వ ఇవ్వడానికి అంగీకరించేది కాదు. దీంతో తల్లిపై కోపాన్ని పెంచుకున్న అశోక్ దారుణానికి ఒడిగట్టాడు.
Read More హైదరాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య... భీమవరంనుంచి వచ్చి...
నిన్న(సోమవారం) తల్లికి సమాచారం ఇవ్వకుండానే హైదరాబాద్ నుండి బీర్కూర్ కు చేరుకున్నాడు అశోక్. తల్లి ఇంట్లోనే వుందని భావించిన అతడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఇంటిపై పోసి నిప్పంటించాడు. దీంతో ఇళ్లంతా మంటలు వ్యాపించి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గుమిగూడారు. అయితే ఇంట్లో వుందనుకున్న తల్లి బయటినుండి రావడంచూసి అశోక్ కంగుతిన్నాడు. స్థానికులు అతడిని పట్టుకోవాలని చూడగా తప్పించుకుని పరారయ్యాడు.
ఈ అగ్నిప్రమాదంలో లక్షా 20వేల రూపాయల నగదుతో పాటు 8తులాల బంగారం కాలిబూడిదైనట్లు చంద్రవ్వ తెలిపింది. గతంలోనూ తనను చంపడానికి కొడుకు ప్రయత్నించాడని... ఇప్పుడు మరోసారి ఆస్తి కోసం హత్యాయత్నానికి పాల్పడినట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. రెండుసార్లు కొడుకు బారినుండి తప్పించుకున్న చంద్రవ్వ తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో వున్న కసాయి కొడుకు అశోక్ కోసం గాలిస్తున్నారు.
