తెలిసిన వాళ్లని, దగ్గరి బంధువులని, స్నేహితులని మీ టూ వీలర్ తాళాలు చేతిలో పెడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఇలా వాహనాలు ఇస్తే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాహనం యజమానే నిందితుడు అవుతారు. 

ఇలాంటిదే ఓ తాజా సంఘటన హైదరాబాద్ మూసాపేటలో జరిగింది. యాక్సిడెంట్ అయి బండి తీసుకున్న వ్యక్తి చనిపోవడంతో స్కూటీ యజమాని జైలుకు వెళ్లారు. వివరాల్లోకి వెడితే..... 

డ్రైవింగ్ లైసెన్స్ లేని స్నేహితురాలికి తన స్కూటీ ఇచ్చాడో స్నేహితుడు. దాన్ని నడుపుతున్న క్రమంలో లారీ గుద్దేయడంతో ఆమె చనిపోయింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ రెండవ నిందితుడు కాగా, స్కూటీ ఇచ్చిన స్నేహితుడిని పోలీసులు ఏ1 గా పేర్కొన్నారు. 

గత శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని ఆది రేష్మా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్కూటీ యజమాని, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయిన  అజయ్‌సింగ్‌ (23) ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉందని చెబుతూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.