మర్మాంగాలు కోసి, తలపై మోది ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అంతకంటే ఘోరం.. శవాన్ని పందులు పీక్కుతినడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన నారాయణ్ ఖేడ్ లో కలకలం రేపింది. బండరాళ్లతో మోది యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌ జంట గ్రామం మంగల్‌పేట్‌లో చోటుచేసుకుంది. 

నారాయణఖేడ్‌–2 ఎస్‌ఐ మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్‌ మండలం ఖాజాపూర్‌కు చెందిన వడ్డె రాజు (23) ఇస్నాపూర్‌లో పని చేసేందుకు వెళ్తున్నానని సోమవారం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం  పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఆవరణలోని చెట్లపొదల్లో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 
మృతదేహన్ని పందులు పీక్కుతింటుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు.

క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించారు. మృతదేహం గుర్తించడానికి వీలులేకుండా మారింది. మర్మాంగాలు కోసినట్లు గుర్తించారు. సమీపంలో రక్తపు మరకలతో రెండు బండరాళ్లు ఉండడంతో తలపై బండరాళ్లతో మోది హత్యచేసినట్లు భావిస్తున్నారు. 
ఘటనా స్థలంలో రెండు జతల చెప్పులు, బెల్టు, మృతుడి ఒంటిపై ఉన్న దుస్తుల్లో ఓ పర్సు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులను స్వా«దీనం చేసుకున్నారు. అందులోని వివరాల ఆధారంగా మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

గ్రామానికి చెందిన వడ్డె సునీల్‌ వచ్చి మృతదేహాన్ని పరిశీలించి తన సోదరుడు వడ్డె రాజుగా గుర్తించాడు. డాగ్‌ స్క్వాడ్‌ మృతదేహం వద్ద ఉన్న చెప్పుల వాసన చూసి సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలోంచి ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వరకు వెళ్లి తిరిగి మృతదేహం సమీపానికి వచ్చి ఆగింది. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మొగులయ్య తెలిపారు.