మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎత్తైన భవనంపై కూర్చొని మద్యం సేవిస్తూ.. ఆ మత్తులో ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని మోతీనగర్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

మద్యం మత్తులో  బిజినెస్ మెన్ శ్రీనివాస్ (48)  భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు. గత రాత్రి శ్రీనివాస్ బిల్డింగ్  3వ అంతస్తు మెట్ల పక్కన ఉన్న గోడపై కూర్చొని మద్యం మత్తులో ..సిగరెట్ కాలుస్తుండగా జారి కింద పడిపోయాడు. వర్షానికి తడిసి ఉన్న మెట్ల పక్కన ఉన్న గోడపై కూర్చొన్న శ్రీనివాస్ జారి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

 వెంటనే భార్యా బిడ్డలు కిందకు వచ్చి  చూసేసరికి శ్రీనివాస్ కొన ఊపిరితో  ఉన్నాడు. దీంతో అతడిని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.