వావి వరుసలు మరచి, కామంతో కళ్లు మూసుకుపోయి పిన్ని వరుసయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని బాబాయ్‌ని చంపాడో వ్యక్తి .

వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి మండలం సంఘాయిపల్లికి చెందిన మీసాల మల్లేశ్‌కు ఉపాధి లేకపోవడంతో ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి.. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో అతనికి నాగర్‌కర్నూల్ జిల్లా సిద్ధాపూర్ మండలం పలుగు తండాకు చెందిన సోనీతో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత వీరు కులాంతర వివాహం చేసుకున్నారు.

ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మల్లేశ్‌కు కొడుకు వరుసయ్యే మెదక్‌పల్లికి చెందిన మీసాల లాలయ్య.. అలియాస్ లాలూ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ.. తరచుగా హైదరాబాద్‌లో ఉంటున్న మల్లేశ్ ఇంటికి వెళ్తుండేవాడు.

చిన్నమ్మతో చనువుగా ఉంటూ... ఇంట్లో సందడి చేసేవాడు. అయితే కొడుకే కదా అని మల్లేశ్ పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో సోనీతో, లాలూకి వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం బంధువుల ద్వారా మల్లేశ్‌కు తెలిసింది. దీంతో అతను పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. ప్రవర్తన మార్చుకోవాలని పెద్దలు సోనీ, లాలూకి సూచించినా ఫలితం కనిపించలేదు.

ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న మల్లేశ్‌ను అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ పథకం పన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న మల్లేశ్ రైతు బంధు డబ్బుల కోసం స్వగ్రామానికి వచ్చాడు.

ఈ విషయం సోనీ... లాలూకి చెప్పింది. ప్రియురాలు ఇచ్చిన సమాచారంతో మరుసటి రోజు లాలూ తలకొండపల్లికి వచ్చాడు. వెంటనే చిన్నాన్న మల్లేశ్‌కి ఫోన్ చేసి మద్యం తాగుదామని చెప్పి... చంద్రధన గ్రామానికి పిలిపించాడు.

అనంతరం ఇద్దరు కలిసి బైక్‌పై తలకొండపల్లికి వెళ్లి... మద్యం కొనుగోలు చేశారు. అనంతరం లాలూ దగ్గరలోని ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లి ఎలుకలను చంపే ముందు కొన్నాడు. అనంతరం ఇద్దరు కలిసి వెళ్తుండగా సంఘాయిపల్లి గ్రామస్తులు వీరిని చూడటంతో లాలూ హత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఆ రోజుకి పీకల దాకా మద్యం తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. మరోసారి ఈ నెల 7న మరోసారి హత్యకు కుట్ర పన్నాడు లాలూ. బాబాయ్‌కి ఫోన్ చేసి సంఘాయిపల్లి గేట్ వద్దకు రమ్మని చెప్పాడు.

మల్లేశ్ అక్కడికి వెళ్లగానే ఇద్దరు బైక్ ఎక్కించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వెళ్లారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగారు. పథకంలో భాగంగా.. మల్లేశ్‌కు లాలూ ఎక్కువగా మద్యం తాగించాడు.

అనంతరం దేవునిపడకల్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మళ్లీ మద్యం తాగారు. చివరల్లో ఎలుకల మందు కలిపిన మద్యాన్ని అతను మల్లేశ్‌కు తాగించాడంతో అస్వస్థతకు గురై మరణించాడు.

అనంతరం మల్లేశ్ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ నెల 11న స్థానికుల సమాచారంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లాలూ, సోనీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వారు నేరాన్ని అంగీకరించారు. కాగా ప్రధాన నిందితుడైన లాలూకు ఇంకా వివాహం కాలేదు.