పెళ్లి భాజా మోగాల్సిన ఇంట చావుభాజా మోగింది. రేపు కూతురు పెళ్లి జరగాల్సి వుండగా అందుకోసం ఏర్పాట్లు చేస్తూ రోడ్డుప్రమాదానికి గురయి ఓ తండ్రి మృత్యువాతపడ్డ దుర్ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల: బంధువుల కోలాహలం, భాజా భజంత్రీల మంగళకర శబ్దాలతో సందడిగా వున్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొది. తెల్లవారితే కూతురు పెళ్లి వుండటంతో అన్నీ తానై ఏర్పాట్లు చూసుకుంటున్న తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బైన నర్సయ్య కూతురు పెళ్లి రేపు (గురువారం) జరగాల్సి వుంది. ఘనంగా కూతురు పెళ్లి జరపాలని భావించిన నర్సయ్య పెళ్లి బాధ్యతలన్నీ మీదేసుకుని ఏర్పాట్లన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి బోజనాల కోసం ముందుగానే కూరగాయలు తెచ్చిపెట్టుకుందామని భావించిన అతడు బైక్ పై మార్కెట్ కు వెళ్లాడు.
కూరగాయలు తీసుకుని వస్తుండగా ఘోరం జరిగింది. నర్సయ్య బైక్ మెళ్లిగా వస్తుండగా జాబితాపూర్ పెట్రోల్ పంప్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కారు వేగంగా వచ్చి నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో నర్సయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నర్సయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడి వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఆనందోత్సాహాలతో కళకళలాడుతున్న ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది.
కూతురు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఇలా తండ్రి మృతిచెందడంతో తిరుమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన పెళ్లి ఏర్పాట్లు చేస్తూ తండ్రి మృతిచెందడంతో ఆ ఆడకూతురు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పెళ్లి చేసుకుని ఆనందంగా కొత్తజీవితం ప్రారంభించాల్సిన అమ్మాయి ఇలా తండ్రి కోసం కంటతడి పెట్టడం అందరినీ కలచివేస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా పెళ్లి భాజా మోగాల్సిన ఇంట చావుభాజా మోగించాల్సి వచ్చింది.
ఇదిలావుంటే ఇవాళ హైదరాబాద్ లో మద్యంమత్తులో కారునడిపిన ఓ తాగుబోతు లారీ డ్రైవర్ ప్రాణాన్ని బలితీసుకున్నాడు. హైద్రాబాద్ శివారుప్రాంతమైన హయత్ నగర్ సమీపంలోని లక్ష్మారెడ్డిపాలెం బీభత్సం సృష్టించిన కారు లారీ డ్రైవర్ మృతికి కారణమైంది. అతివేగంతో దూసుకొచ్చిక కారు ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకిఎగిరి రోడ్డుపై పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
లారీ డ్రైవర్ కిషన్ ను డీకొట్టిన తర్వాత కూడా కారు ఆగకుండా అదేవేగంతో బస్ స్టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే బస్టాప్ లో ఎవ్వరూ లేకపోవడంతో ఫెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుతున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు నడిపిన అజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో కారును నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు.
లక్ష్మారెడ్డి పాలెం వద్ద లారీని నిలిపిన కిషన్ కిందకుదిగి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇదే సమయంలో నల్గొండ నుండి వస్తున్న కారు అమాంతం అతడిపైకి దూసుకెళ్లింది. రెప్పపాటులో కారు దూసుకురావడంతో కిషన్ కు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రమాద సమయంలో డ్రైవర్ అజయ్ తో సహా కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులున్నారు. అచ్యుత రెడ్డి, అజయ్ తో పాటు మరొకరు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఈముగ్గురు రాత్రి వివాహ రెసెప్షన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
