మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతో స్థానికులు ఓ వ్యక్తి మీద దాడికి దిగారు. దీంతో దెబ్బలకు తాళలేక ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ మల్కాజిగిరిలో చోటు చేసుకుంది.
మేడ్చల్ : Medchal-Malkajigiri జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ లో జరిగింది. జవహర్ నగర్ సిఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కౌకూరు భరత్ నగర్ లో రాజు అలియాస్ ఏసు(38) ఒంటరిగా నివసిస్తున్నాడు. పక్కనే మరో గదిలో తల్లి ఉంటుంది. బుధవారం పెరుగు విక్రయించేందుకు వచ్చిన ఓ మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది.
దీంతో కోపోద్రిక్తుడైన భర్త రాజును నిలదీశాడు. విషయం తెలిసిన స్థానికులు కూడా అక్కడికి చేరుకుని రాజు మీద దాడి చేశారు. దీంతో రాజు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందగానే కుషాయిగూడ ఏసీపీ శివ కుమార్ అక్కడికి చేరుకుని విచారణ కొనసాగించారు. రాజుకు అప్పుడప్పుడు మానసిక స్థితి సరిగా ఉండదు అని స్థానికులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. తన కుమారుడిని కావాలనే దాడి చేసి, హత్య చేశారని మృతుడు తల్లి ఆరోపించింది.
స్కూటీమీద వెంబడించి మరీ.. దేహశుద్ధి..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు ఆగస్టులో అస్సాంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టపగలు,నడిరోడ్డుపై మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు మీద వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకాడు. దీంతో యువతి షాక్ అయ్యింది. అయితే తనపై అలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేయలేదు. స్కూటీతో వెంబడించి మరీ ఆ కామాంధుడిని యువతి పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను.. తనకు ఎదురైన సంఘటనను యువతి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు సైతం స్పందించారు.
ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని రుక్మిణీ నగర్ కి చెందిన యువతి భావనా కష్యప్ స్కూటీ మీద వెడుతుంది. నడిరోడ్డు మీద పట్టపగలు ఓ వ్యక్తి ఆమెను అడ్డుగా వచ్చి.. ఆపాడు. అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. ఆమె నిజమే అనుకుంది. ఇదే అదనుగా అతను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించాడు. దీంతో కోపానికి వచ్చిన ఆమె అతడిని వదిలిపెట్టదలుచుకోలేదు. అతనిని స్కూటీతో వెంబడించి పట్టుకుంది. దానినంతటినీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన ఆగ్రహాన్ని తెలియజేసింది.వీడియో పోలీసులకు కంట పడటంతో.. నిందితుడిని అరెస్టు చేశాడు. ఈ విషయాన్ని గువాహటి పోలీసులు తమ ట్విట్టర్ లో షేర్ చేశారు.
దుస్తులు విప్పేసి..
గతంలోనూ ఇలాంటి అసభ్యకరమైన వేధింపుల ఘటనలు జరిగాయి. నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన ఒంటి మీద దుస్తులు అన్నీ విప్పేసి...ఓ మహిళకు తన మర్మాంగాలను చూపిస్తూ.. లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా..తను కారులో కూర్చొని ఉండగా ఓ స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని మర్మాంగాన్ని తనకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే తాను మూత్ర విసర్జన చేయడం కోసం ఇలా చేశానని, అంతేగానీ మరే ఉద్దేశ్యమూ లేదని సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకున్నాడు.
