ఆఫీసులు పని ఉంది.. రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వస్తానని తండ్రికి చెప్పిన కొడుకు.. అంతలోనే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సెల్ ఫోన్లో మాట్లాడుతూ భవనం పైనుండి పడ్డాడని మృతుడి స్నేహితులు చెబుతుండగా.. ఎవరో తోసేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

వనస్థలిపురం ఠాణా పరిధి హస్తినాపురంలోని పంచాయతీ రాజ్ టీచర్స్ కాలనీలో ఉంటున్న బి. తరుణ్ కుమార్ రెడ్డి కొంతకాలంగా స్థానికంగా ఉన్న గణేష్ ఆలయం సమీపంలో ఉన్ ఓ ఆఫీసులో బీపీవోగా పనిచేస్తున్నాడు. తరుణ్ ను అతని తండ్రి కిషన్ రెడ్డి రోజూ పొద్దు ఆఫీస్ దగ్గర దించి, సాయంత్ర పికప్ చేసుకుంటాడు. రోజూ లాగే సోమవారం ఉదయం కూడా కిషన్ రెడ్డి కొడుకును ఆఫీస్ దగ్గర దించాడు. 

సాయంత్రం పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తనకు ఆఫీస్ లో పని ఉందని పొద్దున ఇంటికొస్తానని చెప్పాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున తరుణ్ స్నేహితుడు ఫోన్ చేసి తరుణ్ కు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు.

ఫోన్ మాట్లాడుతూ బిల్డింగ్ మీదినుండి కిందికి పడిపోయాడని హాస్పిటల్ కు తీసుకెల్తున్నామని చెప్పాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యలు ఆస్పత్రికి వచ్చారు. తరుణ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే తన కొడుకును ఎవరో బిల్డింగ్ మీదినుంచి కిందికి తోసి ఉంటారని దర్యాప్తు చేయాల్సిందిగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.