కరోనా వైరస్ మన దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ కరోనా మరణాలను పక్కన పెడితే.. సమయానికి అందాల్సిన వైద్యం అందక చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందిన బాబూరావు(40) ఓ టీవీ మెకానిక్. వారం రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో నారాయణ ఖేడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయాన్నే సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే.. అక్కడి సిబ్బంది బాబూరావుని ఆస్పత్రిలో చేర్పించుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో బాబురావు భార్య.. కాళ్లమీద పడి మరీ ప్రాధేయపడింది. అయినా కూడా లోపలికి అనుమతించలేదు. దాదాపు గంటసేపు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. తప్పనిసరై సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలోనే బాబురావు అంబులెన్స్ లోనే ప్రాణాలు విడిచాడు.

కాగా.. తన భర్తకు కరోనా లేదని.. పరీక్ష చేయిస్తే నెగిటివ్ వచ్చిందని భార్య చంద్రకళ వాపోయింది. అయినా కూడా ఆస్పత్రిలో చేర్పించుకోలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యింది. కనీసం భర్త శవాన్ని ఇంటికి తరలించడానికి కూడా అంబులెన్స్ డ్రైవర్ రెట్టింపు మొత్తంలో డబ్బులు అడిగాడని ఆమె వాపోయింది.