హైదరాబాద్‌: అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈఘటనలో యువకుడి తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.