బాన్సువాడ: దసరా పండగ కోసం ఎక్కడెక్కడో వున్న స్నేహితులంతా స్వస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి సరదాగా మద్యం సేవించడానికి పొలాల్లోకి వెళ్లారు. అయితే మద్యం మత్తులో ఈ సరదా కాస్త సీరియస్ గా మారి ప్రాణాంతక పందేనికి దారితీసింది. ఇలా స్నేహితుల మధ్య సాగిన పందెం ఒకరిని బలితీసుకుంది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన సాయిలు(40) స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం మద్యం సేవించడానికి పంటపొలాల్లోకి వెళ్లాడు. ఇలా స్నేహితులంగా మద్యం సేవిస్తుండగా సాయిలు ఓ మిత్రుడి మధ్య సరదా మాటలు సీరియస్ అయ్యాయి. ఈ క్రమంలో వారిద్దరు ప్రాణాలతో చెలగాటం ఆడే పందేన్ని పెట్టుకున్నారు.

ఫుల్ బాటిల్ లో నీరు. సోడా కలుపుకోకుండా తాగాలన్నది పందెం. ఇలా ఎవరయితే బాటిల్ ను ఖాళీ చేస్తారో వారే గెలిచినట్లు. ఇలా ఇద్దరు స్నేహితులు ప్రమాదకర రీతిలో మద్యాన్ని సేవించారు. అయితే ఇలా మద్యాన్ని సేవించిన సాయిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  దీంతో కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. 

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతికి కారణమైన మిత్రుడితో పాటు మిగతావారికి విచారించి నిజానిజాలు తేల్చనున్నట్లు పోలీసులు తెలిపారు.