భార్య తో ఏదో చిన్న విషయంలో గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిని మరోకరు తిట్టుకున్నారు. అయినా అతని కోపం చల్లారలేదు. అందుకే కత్తితో తన నాలుకను తానే కోసేసుకున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లికి చెందిన చిగుర్ల చంద్రయ్యకి పెళ్లై భార్య, పిల్లలు ఉన్నారు. కాగా...బుధవారం చంద్రయ్యకి భార్య లింగమ్మతో గొడవ అయ్యింది. దీంతో కోపం తట్టుకోలేక తన నాలుకను తానే కత్తిరించుకున్నాడు. నోటి నుంచి రక్తం కారడం చూసిన తల్లి ముత్తమ్మ ఆరా తీస్తే, తెగిన నాలుక భాగాన్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు

ఆమె వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించింది. తొలుత అచ్చంపేటకు, అక్కడినుంచి జిల్లాకేంద్ర ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు  తరలించారు. అప్పటికే ఆలస్యమవడంతో, నాలుకను తిరిగి అతికించే అవకాశమే లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు. తొందరపడి తీసుకున్న నిర్ణయానికి అతనే మదనపడుతుండటం గమనార్హం.