వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. జీతం తక్కువ అయితే ఏంటి..? ప్రేమ సరిపోతుందని భావించారు. ఆనందంగా జీవితాంతం జీవించాలని ఆశపడ్డారు. కానీ పెళ్లి తర్వాత అంతా తారుమారింది. భర్త తక్కువ జీతం సరిపోవడం లేదనే నిరాశ ఆమెలో మొదలైంది. అంతే.. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. ప్రేమించిన భార్య వదిలేసి వెళ్లడంతో తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బోరబండ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్ ప్రాంతంలో నివసించే సాయి కిరణ్(24) ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న యువతిని ప్రేమించాడు. ఆమె ఫోటోని సాయి కిరణ్ చేతిపై టాటూ గా కూడా వేయించుకున్నాడు. ఏడాదిపాటు కలిసి తిరిగారు. ఆ తర్వాత 2019 డిసెంబర్ లో పెద్దలకు తెలీకుండా పెళ్లి చేసుకున్నారు.

మూడు నెలల తర్వాత యువతి తండ్రి.. మళ్లీ ఇద్దరికీ పెళ్లి చేశాడు. అయితే.. సాయి కిరణ్ జీతం సరిపోకపోవడంతో దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు రావడం మొదలయ్యాయి. దీంతో.. సదరు యువతి భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య అలా వెళ్లిపోవడం తట్టుకోలేక సాయి కిరణ్ ఆత్మహత్య  చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.