క్రిమినల్ కేసులు సరిపోవంటూ పోలీసులకు కొత్తరకం కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో పొట్టేళ్లకు కాపాలా కాసిన పోలీసుల స్టోరీ తెలిసిందే. అలాంటిదే ఓ కోడి కేసు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. 

"

దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, దాడులు, ఆస్తులు గొడవలు, అక్రమసంబంధాల కేసులతో విసిగిపోయిన పోలీసులకు కాస్త ఆటవిడుపులాంటి కేసు ఇది. ఓ వ్యక్తి తన కోడిని చంపేశారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. 

తన కోడి పంచాయతీ తేల్చాలంటూ చచ్చిన కోడితో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గశికంటి రాజు అనే వ్యక్తి తన కోడిని చంపేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కోడిని అమానుషంగా ఇసుక ట్రాక్టర్ తో గుద్ధి చంపారని బాధితుడు మంగళవారం చనిపోయిన కోడిని తీసుకొని వచ్చి చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోడి చనిపోవడంతో తనకు న్యాయం చేయాలని పోలీసు మెట్లెక్కినట్లు రాజు చెబుతున్నారు. అయితే కోడితో రాజు స్టేషన్‌కు రావడం చూసి అక్కడున్న పోలీసులు నవ్వుకున్నారు. మరి ఈ కేసును పోలీసులు ఎలా విచారిస్తారో చూడాలి.