ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. తీరా ఆమెను పెళ్లి బంధంలోకి తీసుకువెళ్లాడు. జీవితం సాఫీగా సాగిపోతోందని ఆనందపడిన ఆ యువతికి ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. తనకన్నా ముందు నుంచే మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి షాకయ్యింది. తర్వాత తేరుకొని మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పెద్దపల్లికి చెందిన ఆకుదారి కార్తీక్(29) అనే వ్యక్తి బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు.యూసఫ్ గూడ బస్తీలో ఉంటున్న సమయంలో ఓ ప్రైవేటు ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొద్ది రోజులు సహజీవనం చేశారు. అనంతరం ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు.

అయితే... ఈ యువతితో పెళ్లికి ముందే కార్తీక్... 8 సంవత్సరాల నుంచి మరో యువతితో సహజీవనం చేస్తున్నట్లు తాజాగా ఆమెకు తెలిసింది. 8 సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయామంటూ గుర్తించిన ఇద్దరు యువతులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు.