ఎక్కడి నుంచో వచ్చాడు.. స్నేహం పేరిట పరిచయం పెంచుకున్నాడు. రోజూ మద్యం తాగేవాడు. ఓ రోజు మద్యం మత్తులో స్నేహితుడి భార్య, కూతరిపై కన్నేశాడు. ఆ విషయాన్నే అతని స్నేహితుడికి చెప్పాడు. ఇంకేముంది  స్నేహితుడి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆనంఖాన్‌(31) చాంద్రాయణగుట్టకు వలస వచ్చి ఒంటరిగానే ఉంటున్నాడు. మూడు నెలల క్రితం ఇతనికి స్థానికంగానే ఉన్న బార్‌ వద్ద వాదే సాల్హె హీన్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. నిత్యం మద్యం సేవించే వీరి నడుమ చనువు పెరిగింది. ఈ క్రమంలోనే ఆనంఖాన్‌ వాదే సాల్హె హీన్‌లోని ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటికి వెళ్లొచ్చేవాడు.


ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య, కూతురుపై కన్నేసిన ఆనంఖాన్‌ నేరుగా ఇమ్రాన్‌ ఖాన్‌తోనే నీ భార్య... కూతురు అందంగా ఉంటారని... తనను వారితో కలిసేలా చూడాలని కోరాడు. గురువారం రాత్రి బార్‌ వద్ద మద్యం తాగుతుండగా మరోసారి అడగడంతో... సరే కలిపిస్తానంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ తన బస్తీకి తీసుకెళ్లాడు. ఎక్కడి నుంచో వచ్చి నా భార్య, కూతురుతో అక్రమ సంబంధం అడుగుతావా అని ఆగ్రహించిన ఇమ్రాన్‌ వెంటనే అక్కడే మటన్‌ దుకాణంలో ఉన్న కత్తితో ఆనం కడుపు, సంక, చెవి భాగాలలో పొడిచాడు. ఆనంఖాన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.