జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ఉద్యోగం కోసం కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్ని వివాదాలు ఒక వ్యక్తి హత్యకు దారితీశాయి.

వివరాల్లోకి వెళితే.. థరూర్ మండలం ర్యాలంపాడుకు చెందిన తాయన్న తలారిగా పనిచేసేవాడు. ఆయన మరణించడంతో తాయన్న కుమారుడు రాజుకు ఆ ఉద్యోగం లభించింది. అయితే తలారి ఉద్యోగం విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చాయి.

ఆ ఉద్యోగం తమకే ఇవ్వాలని తాయన్న సోదరుని కుమారుడు గొడవకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని థరూర్ నుంచి ర్యాలంపాడుకు వెళ్లిన రాజు.. అక్కడ తెలిసిన వారిని పలకరించి తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.

అప్పటికే మార్గమధ్యంలో కాపు కాసిన వెంకటన్న అనే వ్యక్తి వేటకొడవళ్లతో రాజుపై దాడి చేయడంతో అతని తల రోడ్డుపై ఎగిరిపడింది. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ రాజు మరణించాడు.

అయితే దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా.. వారిని కొడవలితో భయపెట్టి వెంకటన్న అక్కడి నుంచి పారిపోయాడు. పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.