అతనిది ప్రేమ వివాహం. పెద్దలను ఎదురించి.. ఒప్పించి మరీ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమించి పెళ్లాడిన భార్యను అపురూపంగా చూసుకోవాల్సిందిపోయి.. భార్య చెల్లెలిపై కన్నేశాడు. ఆమెపై మోజుతో భార్య, బిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. పలుమార్లు తన మరదిలితో లేచిపోయాడు కూడా. కాగా.. అతను చేస్తున్న పనులు చూసి ఆమె కుటుంబసభ్యులు రగిలిపోయారు. పథకం ప్రకారం అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కంచన్ బాగ్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మునవర్ ఖాద్రి(27), చంద్రాయణ గుట్ట డివిజన్ హాఫిజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన యువతి(25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల పాప, నెల రోజుల బాబు ఉన్నాడు. కాగా.. ఇటీవల అతని కన్ను భార్య చెల్లెలిపై పడింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

రెండు నెలల క్రితం ఆమెతో కలిసి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఇంటికొచ్చినా ఇద్దరి మధ్యా సంబంధం కొనసాగుతూనే ఉంది. దీంతో.. పద్దతి మార్చుకోవాలంటూ పలుమార్లు భార్య, ఆమె తండ్రి, తమ్ముడు మందలించారు. అయినా.. అతను పద్ధతి మార్చుకోలేదు. దీంతో.. ఈ విషయంలో వారి మధ్య ఘర్షణ మొదలైంది.

ఈ క్రమంలో మునవర్ ఖాద్రి చేతులు, కాళ్లు కట్టేసి నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి  చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.