రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా  కేంద్రంలోని బి.వై. నగర్ కు చెందిన మాదాసు రవీందర్ (31) అనే వ్యక్తి  గతకొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో  బాధపడుతున్నాడు. ఈ బాధను తట్టుకోలేక తాజాగా బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

దీన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడికి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్లు...అయినప్పటికి పరిస్థితి విషమంగానే వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

మరోవైపు భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.
వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన షాహిన్ బేగం(37) కి కొన్ని సంవత్సరాల క్రితం షేక్‌ సాబేర్‌మియా తో వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.

షాహిన్‌ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సాబేర్‌మియా ప్రతిరోజు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో ఆమె ఈ నెల 10న గ్రామంలోని పుట్టింటికి చేరుకుంది. సోమవారం రాత్రి సాబేర్‌మియా తన కుమారుడు రహ్మతుల్లా, అన్న షాబుద్దీన్‌, అతని కుమారులు షేక్‌ ఉబేదుల్లా, షేక్‌ కలీముల్లాతో కలిసి షాహిన్‌బేగం వద్దకు వచ్చి దాడి చేశాడు.ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున  మృతి చెందింది.