రేటు అడిగి.. వస్తువులు కొనలేదని ఓ ఫుట్ పాత్ వ్యాపారి మహిళ మీద దాడి చేసిన ఘటన హైదరాబాద్ రాం గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

తన దగ్గర వస్తువులు కొనుగోలు చేయలేదని ఓ మహిళను ఫుట్ పాత్ వ్యాపారి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన మహిళ ఆ వ్యాపారిని చెంప దెబ్బ కొట్టింది. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యాపారి మహిళ మీద దాడికి తెగబడ్డాడు. 

ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్ కీపింగ్ చేస్తోంది. బుధవారం రెలిఫైల్ బస్టాప్ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెడుతోంది. 

రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఖాజా అన వ్యాపారి వాటర్ బాటిళ్లు అమ్ముతున్నాడు. లక్ష్మి ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో లక్ష్మి వద్దని వెళ్లిపోతోంది. దీంతో ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన లక్ష్మి, ఖాజా చెంప చెల్లుమనిపించింది. 

దీంతో ఫుట్ పాత్ వ్యాపారి ఆమె మీద విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఈ వ్యాపారి మీద ఇలాంటి కేసులు కొత్ కాదని, ఇదివరకు కూడా వినియోగదారులతో ఇలాగే దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయినట్లు తెలిసింది. 

మహిళ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఖాజాను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అదే సమయంలో మహిళ బంధువు ఒకరు విషయం తెలిసి అక్కడికి వచ్చాడు. అతను ఖాజా మీద దాడి చేశాడు. దీంతో పోలీసులు ఆ బంధువు మీద కూడా కేసు నమోదు చేశారు.