తన కోరిక తీర్చడంలేదన్న కోపంతో ఓ మహిళపై బ్లేడ్ తో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
కొత్తగూడెం: తన కోరిక తీర్చలేదని మహిళపై కోపం పెంచుకున్న ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. పొలానికి వెళుతున్న మహిళపై ఓ వ్యక్తి అతి కిరాతకంగా బ్లేడ్ తో దాడిచేసి గాయపర్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన 40ఏళ్ల మహిళ పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఎవరిపైనా ఆదారపడకుండా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఇలా ఒంటరిగా జీవిస్తున్న మహిళపై అదే గ్రామానికి చెందిన ఉదయగిరి కన్నుపడింది.
డబ్బులు ఆశచూపించి మహిళను లొంగదీసుకోవాలని చూసినా కుదరకపోవడంతో మహిళను బెదిరించడం ప్రారంభించాడు. తన కోరిన తీర్చకుంటే అంతుచూస్తానంటూ రెండు నెలలుగా వేధింపులకు పాల్పడ్డాడు. అయినప్పటికి మహిళ భయపడకపోవడంతో ఆగ్రహించిన ఉదయగిరి కోపంతో రగిలిపోయాడు.
అయితే అతడి వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఉదయగిరిని మందలించాలని బాధిత మహిళ గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులను కోరింది. వారు అతడిని పిలిపించి మహిళ వెంటపడుతూ వేధించవద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో ఉదయగిరి కోపం కట్టలుతెంచుకుంది.
తన కోరిక తీర్చకపోవడమే కాదు గ్రామ పెద్దలకు ఫిర్యాదుచేసి పరువుతీసిన మహిళ ప్రాణాలు తీయడానికి ఉదయగిరి సిద్దమయ్యాడు. అదునుకోసం ఎదురుచూస్తున్న అతడికి శనివారం ఒంటరిగా పొలానికి వెళుతూ మహిళ కనిపించింది. బ్లేడ్ తీసుకుని ఆమెవద్దకు చేరుకున్న ఉదయగిరి దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డాడు. అతడు బ్లేడ్ తో గొంతు కోయడానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకుంది. దీంతో ఆమె ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలతో మహిళ కేకలు వేయడంతో అటుగా వెళుతున్నవారు గుమిగూడారు. వీరిలో కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా వారిపైనా ఉదయగిరి దాడిచేసాడు. ఇలా మొత్తంగా ముగ్గురిని బ్లేడ్ తో గాయపర్చాడు. వీరంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై బాధిత మహిళ నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఉదయగిరి పరారీలో వున్నాడని... అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
