ఓ వ్యక్తి సొంత అత్త, ఆమె మనవడిని హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ తెలీనట్టుగా హత్యాస్థలానికీ వెళ్లాడు. చివరకు పోలీసుల విచారణలో నిందితుడిగా తేలి అరెస్టయ్యాడు.
పాల్వంచ : తెలంగాణలోని పాల్వంచ, దమ్మపేట మండలంలో నానమ్మ, మనవడు మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని ఆ ఇంటి అల్లుడే చంపినట్లు గుర్తించారు. సుబ్బలక్ష్మి, ఆకాష్ హత్యలకు సంబంధించిన వివరాలను పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మల్కాపురానికి చెందిన గుడిమెట్ల వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి (57) దంపతులకు నాగేంద్రరావు, గుర్రాజు అనే ఇద్దరు కుమారులు, శ్రీ దుర్గా అనే కుమార్తె సంతానం. అనారోగ్య కారణాలతో వెంకటేశ్వరరావు కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం వెలవెన్నుకు చెందిన మల్లవరపు శ్రీనివాసరావుకు కుమార్తె శ్రీ దుర్గను ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. శ్రీనివాస రావు సుతారీ పనులు చేసేవాడు. కాగా, కొంతకాలంగా శ్రీ దుర్గా, శ్రీనివాసరావుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి అత్త సుబ్బలక్ష్మి కారణంగానే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని అనుమానంతో శ్రీనివాస రావు ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. అతను చంపేస్తే ఇబ్బందులు ఉండవని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం రెండు నెలల కిందటే మల్కాపురంలోని అత్తగారింటికి వచ్చాడు. ఈ నెల 7న సుబ్బలక్ష్మి కుమారుడు నాగేందర్ రావు కుటుంబసమేతంగా అన్నపురెడ్డిపల్లి వెళ్లాడు. దీంతో రెండో కొడుకు కొర్రాజులు కుమారుడు ఆకాశ్ ఆమె వద్ద ఉన్నాడు.
కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారం.. తండ్రికి 20 యేళ్ల జైలుశిక్ష..
ఘటన జరిగిన రోజు మనవడు ఆకాశ్ తో కలిసి సుబ్బలక్ష్మి ఒంటరిగా ఆ ఇంట్లో నిద్రించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాసరావుకు ఇదే అదనుగా దొరికింది. నిద్రపోతున్న సుబ్బలక్ష్మి ముఖం మీద తలదిండుతో అదిమాడు. దీంతో ఊపిరాడక సుబ్బలక్ష్మి మృతి చెందింది. సుబ్బలక్ష్మి కాళ్లు కొట్టుకోవడంతో.. ఆ శబ్దానికి ఆకాశ్ నిద్రలేచాడు. హత్య చేసిన విషయాన్ని ఆకాశ్ బయటికి చెబుతాడని అనుమానించి, భయంతో బాలుడిని కూడా గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాతి రోజు ఏమీ తెలియనట్లుగా బావ మరిదితో కలిసి హత్య స్థలానికి కూడా వచ్చాడు.
కాగా ఆకాష్ తల్లి పోచమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద విచారణ ప్రారంభించారు. నిందితుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. నిందితుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పెద్ద గొల్లగూడెం-మల్కారం క్రాస్ రోడ్ లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో… దమ్మపేట సిఐ బాలకృష్ణ, ఎస్సై శ్రావణ్ కుమార్ బృందాలుగా విడిపోయి పట్టుకున్నారు. దమ్మపేట ఠాణాకు తరలించి విచారించారు. సుబ్బలక్ష్మి, ఆకాశ్ లను తనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్లు ఏఎస్ పి రోహిత్ రాజు పేర్కొన్నారు.
