హైదరాబాద్: మహిళ ఫోన్ నెంబర్ డేటింగ్ యాప్ లో పెట్టిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎదురు ఇంటిలో ఉంటన్నవారితో పెట్టుకున్న చిన్నపాటి గొడవలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి ఆ ఇంట్లోని మహిళ ఫోన్ నెంబర్ ను డేటింగ్ యాప్ లో పెట్టారు. 

గడ్డం రూబీకిరణ్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాదులోని నాగోల్ బండ్లగుడాలోని ఇంద్రప్రస్త కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతని కుటుంబానికి ఎదురింట్లో ఉన్నవారికి చిన్నపాటి గొడవలు ఉన్నాయి. 

వాటిని మనసులో పెట్టుకుని రూబీ కిరణ్ ఆ ఇంట్లో ఉంటున్న మహిళ వివరాలతో మెయిల్ ఐడి తయారు చేశాడు. అసభ్యకరమైన రాతలతో ఆమెను వ్యభిచారణిగా చిత్రిస్తూ ఆమె వివరాలను, ఫోన్ నెంబర్ ను డేటింగ్ యాప్ లో పెట్టాడు. దాంతో ఆమెకు ఫోన్లు రావడం ప్రారంభమైంది. మెసేజ్ లు రాసాగాయి. 

ఆ వేధింపులను తట్టుకోలేక మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ సాగించిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు రూబీకిరణ్ ను గుర్తించారు. గురువారంనాడు అతన్ని అరెస్టు చేశారు. అతని నుంచి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.