కోరిక తీర్చాలంటూ ఓ వివాహిత వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమెతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమె భర్తకు పంపించాడు. ఆమె కాపురాన్ని కూల్చేశాడు. అనంతరం ఆమెను వాట్సాప్ లో వివిధ రకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లాకు చెందిన సంగన్న వెంకటరమణారెడ్డి ప్రస్తుతం మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పదేండ్ల కిందట నెల్లూరు జిల్లా వింజమూర్‌లోని స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న సమయంలో అదే తరగతి విద్యార్థినితో స్నేహం ప్రేమగా మారింది. స్కూల్, కాలేజీ సమయంలో ఇద్దరు ఒంటిరిగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను వెంకటరమణరెడ్డి భద్రపర్చుకున్నాడు. 

2011లో యువతికి వివాహం అయి.. కుటుంబంతో కలిసి హైదరాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. యువతి భర్త ఓ భవన నిర్మాణ సంస్థలో అకౌంటెంట్ పని చేస్తూ ప్రస్తుతం తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న వెంకటరమణారెడ్డి యువతికి ఫోన్‌చేసి లైంగికోరిక తీర్చాలని వెంటపడ్డాడు. యువతి తిరస్కరించడంతో స్కూల్, కాలేజీ సమయంలో దిగిన ఫొటోలను ఆమె భర్త, బంధువులకు పంపాడు.

అంతేకాకుండా ఇంకా అనేక మందికి పంపాడు. భయాందోళనకు గురైన యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడు వెంకటరమణరెడ్డిని అరెస్ట్ చేశారు.