హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ అంటూ ఏకంగా జనాలను బురిడీకొట్టించే కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, తను అడిషనల్ సెక్రెటరీగా ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలను చూస్తుండటంతోపాటు అఖిలభారత అవినీతి నిరోధక కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కొనసాగుతున్నానని చెప్పాడు. 

ఇంకా వివిధ రకాలుగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారంనాడు ఎల్‌ఎండీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కరీంనగర్లోని విద్యానగర్లో నివాసం ఉంటున్న దులిగుంటి సాయిచందన్ (23) స్వగ్రామం తిమ్మాపూర్ మండలంలోని మొగలిపాలెం. 

ప్రజలను వివిధ రకాలుగా మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ ఫర్ సీఎం ఫ్యామిలీ ఎఫైర్స్ గా, ముఖ్యమంత్రి కార్యదర్శి పి. రాజశేఖర్ రెడ్డి నియమించినట్లుగా ధ్రువపత్రాన్ని తయారుచేశాడు. అలాగే అఖిలభారత అవినీతి నిరోధక కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కూడా నకిలీ కార్డును తయారుచేసుకున్నాడు.