హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీ కౌంటింగ్ నిర్వహించాలని  బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

శుక్రవారం నాడు  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను  కలిసి మల్‌రెడ్డి రంగారెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు కేటీఆర్ ఆదేశాల మేరకు పనిచేశారని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి  తనయుడు  మొబైల్ ఫోన్‌తో కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చారన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగానే  తన మెజారిటీని  18వ రౌండ్‌ నుండి తగ్గించారని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకుండా నిలిపివేయాలని ఆయన కోరారు. 

ఈ విషయమై తనకు న్యాయం చేయకపోతే  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన  చెప్పారు. య ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 72,581 ఓట్లు రాగా మల్‌రెడ్డి రంగారెడ్డికి 72,205 ఓట్లు వచ్చాయి.376 ఓట్లతో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు.