డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ తదితర పదవుల్లో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకుని అధిష్టానం తనను సీఎల్పీ నేతగా నియమించిందన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి భట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యలను, ప్రభుత్వ పనితీరును శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అధికారపార్టీ సభ్యుల బలం ఎంత ఉందనేది ముఖ్యం కాదు..  ప్రతిపక్షంగా తమ బాధ్యతను నెరవేర్చడమే ప్రధాన అంశం. తమకున్న 19 మంది సభ్యులు బలమైన నాయకులని, వీరందరికి కాంగ్రెస్ పార్టీ విధానాలపై క్షుణ్ణంగా అవగాహన ఉందని భట్టి అన్నారు.

జానారెడ్డి గారు విఫలమవ్వలేదు.. ఆయన భాష, విషయ పరిజ్ఞానం, విలువలు...ఇప్పుడున్న రాజకీయ నాయకులకు లేదని విక్రమార్క అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే కొలువుల కోసమని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ ఆ హామీలను నెరవేర్చలేదని దీనిపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని తెలిపారు.

ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.  సీనియర్లతోనూ, జూనియర్లతోనూ ఉన్న సన్నిహిత సంబంధాలు వారితో కలుపుకుపోయేందుకు సహకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమకున్న 19 మంది శాసనసభ్యులు ఒత్తిడికి, ప్రలోభాలకు లొంగరని వారు చివరి వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానన్నారు.