కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. ప్రచారంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు టీ కాంగ్రెస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేస్‌లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు టీ కాంగ్రెస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొందరు ముఖ్య నాయకులు.. ఖర్గేకు స్వాగతం పలికారు. కాసేపట్లో గాంధీ భవన్‌లో పీసీసీ సభ్యులతో మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఖర్గే.. పీసీసీ మెంబర్ల మద్దతు కోరనున్నారు. 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతు మల్లికార్జున ఖర్గేకే ఉందన్న సూచనల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. ఇటీవల అధ్యక్ష బరిలో నిలిచిన మరో నేత శశి థరూర్.. ప్రచార నిమిత్తం హైదరాబాద్‌కు రాగా, ముఖ్య నేతలు ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు తాను హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని శశి థరూర్ ఫోన్ ద్వారా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అయితే తమ బంధువు చనిపోవడం వల్ల కలవలేకపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేవంత్‌‌కు ఆయన దగ్గరి బంధువు మృతి పట్ల సానుభూతి తెలిజేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. ‘‘మనం మరోసారి కలుద్దాం’’ అని పేర్కొన్నారు. రేవంత్‌కు, ఆయన బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా తెలిపారు. 

ఇక, పార్టీ అధ్యక్ష ఎన్నికలో తమ మద్దతు మల్లికార్జున ఖర్గే‌కేనని పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేతలు శశి థరూర్ పర్యటనకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి తేదీ.. ప్రస్తతం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ బరిలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచేవారి పేర్లను ప్రకటించనున్నారు. ఈ నెల అక్టోబర్ 17న ఎన్నికలు జరగనుండగా.. 19వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.