ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. మంగళవారం నాందేడ్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి.. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరారు.

ఇందుకు చంద్రశేఖర్ రావు అనుమతించడంతో మరాఠా గడ్డపైనా గులాబీ పార్టీ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాందేడ్ జిల్లాలోని నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన నేతలు .. మా గ్రామాలన్నీ తెలంగాణకు ఆనుకునే ఉన్నాయని కేసీఆర్‌కు తెలిపారు.

ఇక్కడ రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని.. తామంతా బాధల్లో ఉన్నామని తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతూ ఉద్యమం చేస్తున్నామన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్, రజూర తదితర ప్రాంతాల నుంచి కూడా టీఆర్ఎస్ టికెట్ కావాలని పలువురు కోరుతున్నారని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.