తెలంగాాణ ముఖ్యమంత్రి కేసీఆర్. భారత రాష్ట్ర సమితి పార్టీకి మద్దతుగా మహరాష్ట్రకు చెందిన దంపతులు మహా పాదయాత్ర చేపట్టారు.
పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ సక్సెస్ అయి దేశ ప్రధాని కావాలని కోరుకుంటూ మహారాష్ట్రకు చెందిన దంపతులు మహా పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ ప్రజలకు అందిస్తున్న రైతు, దళిత బంధులు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశ ప్రజలందరికి అందాలంటూ కేసీఆర్ ను ప్రధానిని చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ ప్రధానిగా కూడా దేశంలో సుపరిపాలన అందిస్తారని పాదయాత్ర చేస్తున్న దంపతులు పేర్కొన్నారు.
మహారాష్ట్ర చంద్రపూర్ ప్రాంతానికి చెందిన బాబురాం మస్కీ, శోభ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ను కలుసుకునేందుకు మహారాష్ట్ర నుండి తెలంగాణకు పాదయాత్ర చేపట్టారు. జూలై 1న ప్రారంభమైన మస్కీ దంపతుల పాదయాత్ర మహారాష్ట్రలో పూర్తయి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకున్న బాబురాం దంపతులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆత్మీయ సత్కారం చేసారు.
వీడియో
బిఆర్ఎస్ నాయకులతో కలిసి మహారాష్ట్ర దంపతులను కలిసిన ఎమ్మెల్యే చందర్ పుష్ఫగుచ్చం అందించారు.శాలువాలతో వారిని సత్కరించి కేసీఆర్ కోసం పాదయాత్ర చేపడుతున్నందుకు అభినందించారు. వారితో కలిసి కొంతదూరం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే చందర్.
Read More రేపు వరంగల్ లో మోడీ టూర్ కు కేసీఆర్ దూరం: తేల్చేసిన కేటీఆర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా బిఆర్ఎస్ పాలిత తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు, తెలంగాణ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మహారాష్ట్ర దంపతులు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ఎంతలా అభిమానిస్తున్నారో వీరి పాదయాత్రను బట్టే అర్థమవుతుందని ఎమ్మెల్యే అన్నారు.
బిజెపి, కాంగ్రెస్ కబందహస్తాల నుండి దేశానికి విముక్తి కల్పించాలనే సంకెళ్ళతో పాదయాత్ర కొనసాగిస్తున్నానని బాబురాం తెలిపారు. దేశాన్ని అభివృద్ది, సంక్షేమ పథంలో నడిపించే సత్తా ఒక్క కేసీఆర్ కే వుందని ఆయన అన్నారు. దేశంలోని రైతుల బానిస సంకెళ్లు తొలగించాలని కేసీఆర్ ను కోరనున్నామని అన్నారు. హైదరాబాద్ వరకు ఇలాగే పాదయాత్ర సాగించి ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలవనున్నట్లు బాబురాం మస్కీ దంపతులు వెల్లడించారు.
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరారు బాబురాం. కేసీఆర్ కు మాత్రమే మోదీని ఎదుర్కొనే దమ్ముందని... ఆయనకు మద్దతుగా నిలవడం తెలంగాణ ప్రజల బాధ్యత అని అన్నారు. దేశ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలకు అందుతున్న సక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం వుందన్నారు బాబురాం, శోభ దంపతులు.
