Asianet News TeluguAsianet News Telugu

కోడ్ ఉల్లంఘనపై రాష్ట్రపతి గవర్నర్ లను కలుస్తాం: ఉత్తమ్

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో మహాకూటమి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ,టీజేఎస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. 

mahakutami emergency meeting
Author
Hyderabad, First Published Sep 29, 2018, 2:31 PM IST

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో మహాకూటమి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ,టీజేఎస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. 

 టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ నెల నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అనేక చోట్ల ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రారంభోత్సవాలు శంఖుస్థాపనలు చేస్తోందని ఆరోపించారు. మహాకూటమిలో ఇతర పార్టీలు కూడా చేరబోతున్నారని త్వరలోనే వారితో సమావేశమవుతామని ఉత్తమ్ తెలిపారు. అధికారులు కూడా ప్రారంభోత్సవాలకు శంకుస్థానపనలలో పాల్గొనరాదని సూచించారు. అక్టోబర్ 2లోగా అన్ని పార్టీలు కలిసి కామన్ ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలిపారు. 

వివిధ పార్టీలకు వివిధ మేనిఫెస్టోలు ఉంటాయని అయితే కూటమిలో అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షయే లక్ష్యంగా మహాకూటమి పయనిస్తోందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తెలిపారు. కేంద్రమాజీ మంత్రి దత్తాత్రేయను తాను కలిశానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.  

ఉద్యమ హక్కుల సాధన నాలుగున్నరేళ్లలో నెరవేర్చలేదని తాము నెరవేర్చబోతున్నామని తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కామన్ ప్రోగ్రామ్ నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అలాగే మహాకూటమి పేరు తాము పెట్టుకున్నది కాదని త్వరలోనే పేరు కూడా పెడతామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు కూటమిలో సీట్ల కేటాయింపుపై చర్చ జరగలేదని కోదండరామ్ తెలిపారు. 

తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యంగా మహాకూటమి పనిచేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సెక్షన్ 30 అమలులో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై చాడ మండిపడ్డారు. సామాజిక తెలంగాణ సాధనయే లక్ష్యంగా అంతా కలిసి పనిచేస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మంత్రులు కొత్త జీవోలు విడుదల చేస్తున్నారని, శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆరోపించారు. ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులపై చర్చ జరగలేదన్నారు. టిక్కెట్లు ప్రకటించకపోయినా కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని అది సరికాదన్నారు. కూటమిలో సీట్ల కేటాయింపులపై నిర్ణయం వెలువడనప్పడు ప్రచారం చేయడం సబబు కాదన్నారు.  

అటు తెలంగాణలో విపక్షాలను టీఆర్ఎస్ పార్టీ శత్రువులుగా చూస్తుందని టీడీపీ ప్రెసిడెంట్ ఎల్. రమణ ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను నాలుగున్నరేళ్ల అప్పులపాల్జేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 50వేల కోట్లు అప్పు చేసినట్లు కేసీఆర్ చెప్తున్నారని అంతకంటే నిదర్శనం ఏముందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ తర్వాత ఎలా మాటమార్చారో అందరూ గమిస్తూనే ఉన్నారన్నారు. 

తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకువస్తే కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రభుత్వాన్ని గుత్తాధిపత్యంగా తమ చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మిగిలిన పార్టీలను శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా తినేశారని దుయ్యబుట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా మహాకూటిమి పనిచేస్తోందని తెలిపారు. శాశ్వతంగా ఫామ్ హౌస్ కే కేసీఆర్ ను పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios