మహబూబాబాద్‌లో కిడ్నాప్, హత్యకు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి కేసులో అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుడు మందసాగర్‌కు వున్న నేరచరిత్ర ఒక్కొక్కటి బయటపడుతోంది.

అతని బావలు పోలీస్ శాఖలో ఉండగా.. వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఆరేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేసిన సాగర్ గతంలో ఇజ్రాయెల్ యాప్ సాయంతో ఓ మహిళను వేధించినట్లుగా తెలుస్తోంది.

అప్పుడు కూడా పోలీసులకు ఫోన్ స్టేటస్ కనిపించకుండా తప్పించుకున్నాడు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లోనే వుంది. తాజాగా ఘటనతో సాగర్ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 

Also Read:కిడ్నాప్‌కు గురైన గంటలోపే హత్య, ఆ తర్వాతే డబ్బుల డిమాండ్: దీక్షిత్ రెడ్డి హత్యపై ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌ రెడ్డి (9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కే. సముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు.

కిడ్నాపర్లు బాలుడిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి అతి కిరాతకంగా హతమార్చారు. మృతదేహం కనీసం గుర్తు పట్టడానికి కూడా వీల్లేని స్థితిలో ఉంది. దీక్షిత్‌ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.