Asianet News TeluguAsianet News Telugu

సెల్ ఫోన్లు కొట్టేసి.. ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేసే అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..

రోడ్డు పక్కనుండే మొబైల్‌ షాపుల్లో చోరీ చేసి,  ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేసే ఓ అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులున్నారు. మియాపూర్‌ ఠాణా పరిధిలోని రిలయన్స్‌ డిజిటల్‌ షాపులో గత నెల 14న జరిగిన చోరీ నేపధ్యంలో ఈ ముఠా అరెస్టయ్యింది. 

Maha gang held for stealing mobiles from Miyapur store - bsb
Author
Hyderabad, First Published Dec 9, 2020, 11:06 AM IST

రోడ్డు పక్కనుండే మొబైల్‌ షాపుల్లో చోరీ చేసి,  ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేసే ఓ అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులున్నారు. మియాపూర్‌ ఠాణా పరిధిలోని రిలయన్స్‌ డిజిటల్‌ షాపులో గత నెల 14న జరిగిన చోరీ నేపధ్యంలో ఈ ముఠా అరెస్టయ్యింది. 

రిలయన్స్ డిజిటల్ షాపులో నవంబర్ 14వ తేదీ  తెల్లవారుజామున ఈ ముఠా 119 సెల్‌ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లింది. షాపు వాళ్లు పెట్టిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసి పోలీసులు చాకచక్యంగా దొంగలను అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి  113 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

మంగళవారం మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్‌లతో కలిసి సీపీ సజ్జనార్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్‌ తాబ్రేజ్‌ దావూద్‌ షేక్‌ నాగ్‌పూర్‌లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్‌ ముంతాజ్‌ షేక్, రషీద్‌ మహమ్మద్‌ రఫీక్‌ షేక్, మహమ్మద్‌ షుఫియాన్‌ షేక్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.  

కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్‌ఫోన్లు, సూరత్‌లోని ఓ మొబైల్‌ షాప్‌లో 180 సెల్‌ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో అద్దె వాహనంలో హైదరాబాద్‌కు వచ్చారు.  నంబర్‌ ప్లేట్‌ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. 

ప్రధాన రహదారి వెంట సెల్‌ఫోన్‌ షాప్‌లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్‌లోని రిలయన్స్‌ డిజిటల్‌ షాప్‌ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్‌ఫోన్లు సంచిలో వేసుకొని కారులో పరారయ్యారు.

పంజాగుట్టలో ఓ షట్టర్‌ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్‌చెరులోని వైన్స్‌ దుకాణం షెట్టర్‌ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.  

సమాచారం తెలుసుకున్న మియాపూర్‌ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్‌ ప్లేట్‌ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు.  

షోలాపూర్‌ టోల్‌ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్‌ ఎస్‌వోటీ, మియాపూర్‌ పోలీసులు బృందాలు ఏర్పడి  20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. 

గతంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios