Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బిజెపి దూకుడు... బండి సంజయ్ ను పరామర్శించి, సన్మానించిన ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ (Video)

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి అదే ఊపును కొనసాగిస్తోంది. రోజుకో జాతీయ నాయకుడు తెలంగాణకు వచ్చి స్థానిక నాయకులు, కార్యకర్తలకు ధైర్యాన్ని చెబుతున్నారు. ఇలా ఇవాళ (శుక్రవారం) మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ హైదరాబాద్ కు విచ్చేసారు.

madhya pradesh cm shivaraj singh chouhan at telangana bjp office in hyderabad
Author
Hyderabad, First Published Jan 7, 2022, 3:55 PM IST

నాంపల్లి: తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ తర్వాత బిజెపిలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. జైలు నుండి సంజయ్ బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయనను పరామర్శించేందుకు జాతీయస్థాయి నాయకులు తెలంగాణకు క్యూకట్టారు. ఇప్పటికే  తరుణ్ చుగ్ (tarun chug) రాష్ట్రంలోనే తిష్టవేయగా బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా (jp nadda), కేంద్ర మంత్రి భగవత్ కూబాతో పాటు చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ (raman singh) బండి సంజయ్ ను పరామర్శించారు. ఇవాళ(శుక్రవారం) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (shivaraj singh chouhan) బండి సంజయ్ ను పరామర్శించడానికి హైదరాబాద్ కు విచ్చేసారు. 

ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ సీఎం చౌహాన్ కు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి నుండి నేరుగా నాంపల్లిలోని బిజెపి ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన సీఎం శివరాజ్ చౌహాన్ కు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్ తో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. 

Video

ఈ సందర్భంగా బండి సంజయ్ విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఆయనకు బండి సంజయ్, ఈటల రాజేందర్ శాలువాతో సత్కరించగా... తిరిగి సంజయ్ కు కూడా ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. 

ఇక నిన్న(గురువారం) చత్తీస్ ఘడ్ సీఎం రమణ్  సింగ్ కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబసభ్యులతో కూడా రమణ్ సింగ్ ముచ్చటించారు.  కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా వ్యవహరించారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చార‌ని చత్తీస్ ఘ‌డ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. అయితే  త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు లాఠీల దెబ్బ‌ల‌కు, బుల్లెట్ల గాయాల‌కు భ‌య‌ప‌డేవారు కార‌ని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు చూపుతున్న పోరాటానికి, తెగువ‌కు సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పారు. 

అంతకు ముందు కేంద్ర మంత్రి భగవత్ కూబా కూడా బండి సంజయ్ ని పరామర్శించారు. హైకోర్టు నుండి బెయిల్ పొంది కరీంనగర్ జైలు నుండి విడుదలవగానే సంజయ్ కు కూబా స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించారు. 

ఇక బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకుని నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి జైలుకు పంపడంలో బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా సీరియస్ అయ్యారు. వెంటనే ఆయన హైదరాబాద్ లో సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్దకు నల్ల కండువాతో చేరుకుని నిరసన తెలిపారు. 

317 జీవో రద్దును చేయాలంటూ బండి సంజయ్ కరీంనగర్ లో గత ఆదివారం జాగరణ దీక్షకు దిగారు. అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధలకు విరుద్దంగా దీక్ష చేపడుతున్నారంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి శ్రేణులు, పోలీసులకు మధ్య యుద్ద వాతావరణం ఏర్పడింది. చివరకు కార్యాలయ గేట్లను మూసేసి సంజయ్ దీక్షకు సిద్దమవగా పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో ఆ గేట్ ను కట్ చేసిమరీ ఆయనను అరెస్ట్ చేసారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios