వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. గతకొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమజంట పెళ్లి చేసుకొని ఒక్కటై ఆనందంగా జీవించాలనుకుని ఎన్నో కలలు కన్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కలిసి బ్రతకాలనుకున్న వీళ్లు చివరకు కలిసి చావాలనుకున్నట్లున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు కలిసి రైలుకిందపడి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్, మహైశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన శ్రావణి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. డిగ్రీ చదువుతున్న అతడు,  ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి కాలేజికి వెళ్లే సమయంలో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇరువురు కలిసి జీవితాన్ని పంచుకోవాలని కలలుకన్నారు. 

అయితే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. దీంతో కులాలు వేరైన వీరిద్దరికి పెళ్లి చేసుకోడానికి సిద్దపడినా కుటుంబసభ్యులు అందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక...విడిపోయి వుండలేక ఈ ప్రేమజంట ఘోర నిర్ణయం తీసుకుంది. 

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రేమజంట ఇంటినుండి బయటకు వచ్చి శంషాబాద్ మండలం పిల్లోని గూడకు చేరుకున్నారు. అక్కడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారిని తర్వాత స్థానికులు రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరకలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ ఆత్మహత్యల గురించి  సమాచారం అందించారు.