ఒకే గ్రామానికి చెందిన వారిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. కులాలు వేరైనప్పటికి  మనసులు కలవడంతో పెళ్లిచేసుకోవాలనుకున్నారు. అయితే ఈ పెళ్లికి పెద్దలు  అంగీకరించపోవడంతో ఇక కలిసి బ్రతకలేమని భావించారు. కనీసం కలిసి చద్దామని నిర్ణయించుకుని దారుణానికి పాల్పడ్డారు. పాఠశాల గదిలో ఒకే తాడుతో ఇద్దరు ఉరేసుకుని ప్రాణాలు వదిలారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు, గ్రామస్ధులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా  కొండపాక మండలం లక్డారం గ్రామానికి చెందిన  కనకయ్య(21),  తార(19) గతకొంతకాలంగా   ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం తెలియడంతో ఇరు కుటుంబసభ్యులు వీరిని మందలించారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పినా కులాలు వేరవడంతో అందుకు అంగీకరించలేరు. దీంతో ఈ ప్రేమ జంట తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. 

ఈ క్రమంలోనే పెద్దలను ఎదిరించి కలిసి బ్రతకలేము...కాబట్టి కలిసైనా చద్దామని నిర్ణయించుకున్న వీరు దారుణానికి పాల్పడ్డారు బుధవారం అర్థరాత్రి  ఇంట్లో నుండి బయటకు వచ్చిన వీరు గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాలలోకి చేరుకున్నారు. ఓ తరగతి గదిలో తమతో పాటు తెచ్చుకున్న తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

ఉదయం ఈ  ఆత్మహత్యల గురించి  తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి  తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ  ఆత్మహత్యలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.