వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు.. బలవంతంగా వేరే అతనితో అమ్మాయికి వివాహం చేశారు. అయినా అతన్ని విడిచి ఉండలేకపోయింది. ఇద్దరూ కలిశారు. మరణంలోనైనా కలిసుందామని నిశ్చయించుకున్నారు. మరణంలోనూ తమర్ని ఎవరూ విడదీయద్దనుకున్నారేమో.. ఇద్దరి చేతులను తాళ్లతో బిగించుకుని మరీ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

వరంగల్ జిల్లా మామునూరులో జరిగిన ఈ సంఘటన హృదయాల్ని కలిచి వేస్తుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లి శివారులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతులు నక్కలపల్లికి చెందిన మన్నె సాయికుమార్‌ (23), సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపురం గ్రామానికి చెందిన తాటిపాముల అశ్విని (21).

సాయికుమార్, అశ్విని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలనుకున్నారు. అంగీకరించని యువతి తల్లిండ్రులు, మరొకరితో ఆమె వివాహాన్ని జరిపించారు. మూడుముళ్లు పడినా ప్రేమికుడిని మరువలేని యువతి.. ప్రేయసికి పెళ్లయిందని తెలిసినా ఆమెను వీడి ఉండలేక ఆ యువకుడు, ఓ వ్యవసాయ బావి వద్ద కలుసుకున్నారు. పరస్పరం చేతులను తాళ్లతో బిగించుకొని నీళ్లలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

సీఐ సార్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు. సాయి, ఢిల్లీలో చదువుకుంటుంటే, అశ్విని వరంగల్‌లో చదువుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో వృత్తి విద్యా కోర్సు చదివిన సమయంలోనే పరస్పరం ఇష్టపడినట్లు తెలిసింది. వీరి ప్రేమ సంగతి తెలిసినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

4 నెలల కిందట అశ్వినిని సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అశ్విని ప్రస్తుతం గర్భవతి కూడా. ఈ పెళ్లి ఇష్టం లేని అశ్విని కాలేజీకి వెళ్తానని చెప్పి నక్కలపల్లికి వచ్చింది. సాయికుమార్‌ తల్లిదండ్రులు కుమారస్వామి, జ్యోతిలను విచారిస్తున్నారు. ఆ దంపతులకు సాయి ఒక్కడే కుమారుడు.