అనుమానం వచ్చి లాడ్జీ సిబ్బంది కిటికీలోంచి చూడగా విష్ణు, మౌనిక మంచంపై విగత జీవులుగా కనిపించారు.

తమ ప్రేమను సమాజం అంగీకరించదనే బాధతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వామి దర్శనానికి వెళ్లి.. అక్కడ ఒక లాడ్జి తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన మౌనిక, బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన విష్ణువర్ధన్‌ కలిసి శనివారం వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చారు. బద్దిపోచమ్మ వీధిలో ఉన్న ఓప్రైవేట్‌ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. ఒకరోజు కోసం రూమ్‌ తీసుకున్న ఇద్దరు మరుసటిరోజు ఆదివారం అద్దెను పొడగించుకుని ఆ రూమ్‌లోనే గడిపారు. సోమవారం రూం ఖాళీ చేయాలని లాడ్జీ నిర్వాహకులు ఆదేశించారు. మంగళవారం మొక్కులు చెల్లించుకునేది ఉందని చెప్పి మళ్లీ అద్దె పొడగించుకున్నారు.

మంగళవారం రూమ్‌ ఖాళీ చేయించడానికి లాడ్జీ నిర్వాహకులు రూమ్‌ వద్దకు వెళ్లి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. అనుమానం వచ్చి లాడ్జీ సిబ్బంది కిటికీలోంచి చూడగా విష్ణు, మౌనిక మంచంపై విగత జీవులుగా కనిపించారు. ఇద్దరి నోట్లో నుంచి నురగులు వచ్చినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి తీసుకుని గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్‌ నోట్, ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతుల అడ్రస్‌ గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.

అయితే.. వీరి మృతి వెనక వివాహేతర సంబంధమే కారణం అని తెలుస్తోంది. మౌనిక, విష్ణు.. పదోతరగతి నుంచే ప్రేమించుకున్నారు. అయితే.. ఆమెకు ఇష్టం లేకుండా వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. పెళ్లి జరిగినా.. ఆమె వివాహేతర సంబంధం కొనసాగించడంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా.. వారి ప్రేమను ఇద్దరు కుటుంబసభ్యులు అంగీకరించరనే కారణంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.