తమ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదనే మనస్థాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బల్మూర్ మండలం బిల్లకల్లుకు చెందిన అఖిల(19), అదే మండలంలోని చెంచుగూడెంకు చెందిన నిమ్మల అనిల్(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. ఇటీవల ఈ విషయం అఖిల ఇంట్లో తెలిసిపోయింది.  దీంతో... అఖిల ను ఆమె తల్లి మందలించింది. సదరు యువకుడికి దూరంగా ఉండాలంటూ హెచ్చరించింది.

ఇదే విషయాన్ని అఖిల తన ప్రియుడు అనిల్ కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. తమ ప్రేమను పెద్దలు అంగీకరించని వారు తీర్మానించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి అనిల్.. అఖిల ను తీసుకొని వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో అనిల్ తన స్నేహితులకు ఫోన్ చేసి.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు.

దీంతో.. వెంటనే స్పందించిన స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్ల ఆచూకీ కోసం అన్ని చోట్లా గాలించారు. అయినప్పటికీ వాళ్ల ఆచూకీ లభించలేదు. కాగా.. సోమవారం ఉదయం రుషుల చెరువు అటవీశాఖ బేస్ క్యాంపు వెనక ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోని కనిపించారు. వాళ్లు చూసే సమయానికే ఇద్దరూ చనిపోయి కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.