వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బోరెండల్‌ కిరణ్‌కుమార్‌ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్‌బజార్‌ సేల్స్‌ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్‌ ఉప్పల్‌లోని బజాజ్‌ వెహికల్‌ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్‌లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్‌ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు.

 ఆ రోజు రాత్రి బాత్‌రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్‌ సిబ్బంది డోర్‌ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌ డోర్‌ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్‌పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్‌ను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.