ఆవేశంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వధువు కుటుంబసభ్యులు ప్రేమజంటపై దాడి చేశారు. కుర్చీతో కొట్టడంతో వరుడు రాజుకు గాయాలయ్యాయి.
మరో ప్రేమజంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పోలీసుల రక్షణ లో ఉండగానే వారిపై దాడి జరగడం గమనార్హం. అడ్డుకున్న కానిస్టేబుల్ పై కూడా దాడి చేయడం విశేషం. ఈ సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...నిజామాబాద్ నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన బేస రాజు(ఎస్సీ), నందిపేట మండలంలోని బీసీ వర్గానికి చెందిన చిలుగూరు నిరీష రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. వివాహానికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి, ఎమ్మార్పీఎస్ నాయకులు మానికొల్ల గంగాధర్, డల్ల సురేశ్‌ల సహకారంతో ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లి చేసుకున్నారు.
అనంతరం రక్షణ కల్పించాలంటూ నవీపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇరువురు మేజర్‌లే కావడంతో ఈ విషయమై ఇరువురి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆవేశంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వధువు తల్లి నాగమణి, అన్న మారుతి, సాయి (వరుసకు అన్న)లు ప్రేమజంటపై దాడి చేశారు. కుర్చీతో కొట్టడంతో వరుడు రాజుకు గాయాలయ్యాయి. ఇద్దరిపైనా పిడి గుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ బాబునాయక్‌పైనా దాడి చేశారు. అక్కడే ఉన్నఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్ల సురేశ్‌తో పాటు మరో మహిళ యెలుమల గంగామణిని దుర్భాషలాడారు.
