ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనతో పాటు విధుల్లో ఉన్న క్లీనర్ ను లారీ డ్రైవర్ హత్య చేశాడు. ఇనుప రాడ్ తో కొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడు. కాకినాడకు చెందిన వారిద్దరు కూడా కరీంనగర్ వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

లారీ డ్రైవర్ క్లీనర్ మృతదేహంతో ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. దీంతో పోలీసులే ఆవాక్కయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన డ్రైవర్ నైఫ్ రాజు, క్లీనర్ రాజు నూకల లోడు కోసం కరీంనగర్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో లారీ లోడుకు పట్టా కట్టే విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో క్లీనర్ రాజును లారీ డ్రైవర్ రాడ్ తో కొట్టి ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత లారీలో వేసుకుని కాకినాడ బయలుదేరాడు. ఖమ్మం దాటగానే జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

తన ప్రాణాలు కాపాడుకోవడానికి కత్తితో పొడిచానని, క్లీనర్ కత్తితో తనను హత్య చేయాలని చూశాడని నైఫ్ రాజు చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.