రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణానికి హాని కలగని విగ్రహాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి అందరిలో మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను గత నెల రోజులుగా తెలియపరుస్తూ ప్రచారం కల్పించారు. 

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పర్యావరణానికి హాని కలిగే రంగుల విగ్రహాల వాడటం పట్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో జిల్లా ఎస్పీ ప్రజలకు వివరించారు. 

ఒకవేళ విగ్రహాలకు రంగులు వాడినా కానీ ఆహార పదార్థాల్లో వినియోగించే రంగులనే వినియోగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హానికర రసాయనాలను విగ్రహాలకు వాడకుండా ముందు నుండి విగ్రహ తయారీదారుల్లో కూడా అవగాహన కల్పించి వారికి తగు సూచనలు ఇస్తూ వచ్చారు.

ఈ అంశం పట్ల ప్రజలు కూడా స్పందించి చాల మటుకు జిల్లాలో మట్టి విగ్రహాల వైపే మొగ్గు చూపారు. దాంతో సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తీసుకున్న చొరవ విజయవంతమయ్యింది. 

జిల్లాలో చాలా మంది గణేష్ మండప నిర్వాహకులు మట్టి వినాయకుని విగ్రహాల పట్ల ఆసక్తి చూపారు. ఇళ్లలో కూడా మట్టి గణపతినే పూజించటంతో ఒక విధంగా జిల్లా ప్రజల్లో ఒక కొత్త మార్పు తీసుకురావటంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సఫలీకృతులయ్యారు.

జిల్లాలో 80% వరకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించటం విశేషం. 
అంతే కాదు జిల్లాలో మట్టి విగ్రహాలను పెట్టిన వారిని స్వయంగా జిల్లా ఎస్పీ సన్మానిస్తూ వారికి పోలీస్ శాఖ తరపున అన్ని విధాల సహకరిస్తున్నారు. ముందు నుండి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలను చైతన్య పరుస్తూ రావటం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమయిందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.