తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాల కోసం దుకాణాలకు పోటెత్తారు. ముఖ్యంగా లాక్‌డౌన్ ప్రకటనతో మందు బాబులు షాక్‌కు గురయ్యారు. ఇక మందు దొరకదేమోనన్న భయంతో వారంతా మద్యం షాపులకు పరుగులు తీశారు.

దీంతో మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. రాజధాని హైదరాబాద్‌లోని వైన్‌షాపుల వద్ద మద్యం కోసం ఎగబడుతున్నారు. మద్యం కోసం తోపులాట జరగడంతో భౌతికదూరం కనిపించడం లేదు. 

కాగా, రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుండి  10 రోజుల పాటు లాక్‌డౌన్ నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది.

Also Read:తెలంగాణలో రేపటి నుంచే లాక్ డౌన్: నియమాలు ఇవీ...

మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకొన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు  నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొనేందుకు  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

రాష్ట్రంలో రేపటి నుండి లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు తెలపనున్నారు. లాక్‌డౌన్ విషయమై హైకోర్టు ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. కరోనా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.