హైదరాబాద్: రాష్ట్రంలోని కంటోన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపింది. హైదరాబాదులోని కంటోన్మైంట్ జోన్లలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపింది. 

తెలంగాణలో రాత్రి 9.30 గంటల లోపల అన్ని షాపులు మూసేయాల్సి ఉంటుంది. రాత్రి పది గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.హైదరాబాదు కంటోన్మైంట్ జోన్లలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది.  కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ కు సంబంధించిన నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు 16 వేలు దాటాయి. మంగళవారంనాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 16,339 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 260 కోవిడ్-19 వ్యాధితో 260 మంది మరణించారు. హైదరాబాదులో పరిస్థితి దారుణంగా ఉంది. మంగళవారంనాడు హైదరాబాదులో 869 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోనూ హైదరాబాదు చుట్టపక్కల ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ స్థితిలో జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల మందికి పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత నెల 16వ తేదీ నుంచి జీహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తోంది.