హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు ప్రకటించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నందున హైకోర్టు ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకొంది. కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్ డౌన్ వచ్చే నెల 5 వరకు పొడిగిస్తున్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ తో పాటు  నేరుగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలు చేసుకోవచ్చని  కూడ హైకోర్టు సూచించింది. 

అత్యవసర కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.మార్చి నుండి కరోనా నేపథ్యంలో  హైకోర్టు సహా పలు కోర్టుల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కోర్టులు విధులు నిర్వహిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1896 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 82 వేలు దాటాయి. కరోనాతో గత 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 645కి చేరుకొంది.