దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. తాజాగా లాక్ డౌన్ 4.0 విధించగా.. కొద్దిపాటి సడలింపులు చేశారు. ఈ సడలింపుల మేరకు హైదరాబాద్ నగరంలో ఏవేవి తెరుచుకున్నాయి.. వేటికి ఇంకా అనుమతి లభించలేదో ఓసారి తెలుసుకుందాం..

ఆటో రిక్షాలు, క్యాబ్‌లకు అనుమతి ఇవ్వడంతో రవాణా కష్టాలు కొంచెం తీరనున్నాయి. ఇప్పటికే సిమెంటు, స్టీలు షాపులతో పాటు ఎలక్ర్టికల్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలు తెరిచే ఉన్నాయి. తాజా సడలింపులతో సెలూన్లతో పాటు మొత్తం అన్ని దుకాణాలూ సరి - బేసి పద్ధతిన తెరుచుకోనున్నాయి. అయితే.. సిటీబస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌లకు అనుమతివ్వలేదు. 

క్యాబ్ లు తిరగడానికి అనుమతి ఇఛ్చినప్పటికీ.. వాటిలో ఎక్కువ మంది ఎక్కడానికి వీలులేదు. క్యాబ్‌ (ట్యాక్సీ)లో అయితే డ్రైవర్‌తో పాటు ముగ్గురు ఉండాలన్న నియమం పాటిస్తూ నడపాలని సూచించారు. ఈ సమయంలో ప్రయాణికులు ఎవరికి వారు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్వాహకులు కార్లను పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ఆటో లో అయితే.. డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఎక్కడానికి అనుమతి ఉంటుంది. ముఖానికి మాస్క్ లేకుంటే..కూడా ఎక్కనివ్వరు. 

తెరుచుకున్నవి..

ఆటోలు

క్యాబ్‌లు

అన్ని రకాల దుకాణాలు (సరి - బేసి పద్ధతిన)

వ్యక్తిగత వాహనాలు

సెలూన్లు

బ్యూటీ పార్లర్లు


ఇక తెరుచుకోనివి..
ఆర్టీసీ బస్సులు

మెట్రో

సినిమా హాళ్లు, మాల్స్‌

ప్రార్థనా మందిరాలు

బార్లు, క్లబ్బులు,జిమ్‌లు, పార్కులు

ఫంక్షన్‌ హాల్స్‌


కాగా... ఈ సడలింపులతో నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు పలు చోట్ల జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, వాటర్‌బోర్డులకు సంబంధించిన పనులు సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండనున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45, గచ్చిబౌలి, రాయదుర్గం, బాలానగర్‌, పంజాగుట్ట శ్మశాన వాటిక, షేక్‌పేట, నానల్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.