హైదరాబాద్: మందుబాబులకు హైద్రాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం నుండి 30వ తేదీన ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది.

హోళీ పండుగ రోజున తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయకుండా ఉండేందుకు గాను  మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున ఈ దఫా కఠినంగా నిబంధనలను పాటించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకొంది. 

హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది.  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లను మూసివేయాలని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

 హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని ఆయన కోరారు.

 వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరించారు.